
దక్షిణాది నుంచి ఉత్తరాదిలో అడుగుపెట్టి టాప్ హీరోయిన్గా వెలుగొందిన వారిలో జయప్రద కూడా ఒకరు. 80, 90 దశకాలలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ను ఆమెను తన అందం, అభినయంతో ఏలారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, కమల్ హాసన్, అమితాబ్, రాజేష్ ఖన్నా, జితేంద్ర తదితర అగ్రనటుల సరసన నటించి మెప్పించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు జయప్రద. అయితే కెరీర్లో సక్సెస్ అయిన ఆమె వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే..
జయప్రద అసలు పేరు లతితా రాణి రావు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 3 ఏప్రిల్ 1962న జన్మించారు. ఆమె తండ్రి కృష్ణారావు సినిమాలకు ఫైనాన్స్ చేస్తుండటంతో చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది. ఆ తర్వాత డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకున్నారు జయప్రద. లలితా రాణిగా ఉన్న ఆమెను పేరును నటుడు ప్రభాకర్ రెడ్డి.. జయప్రదగా మార్చారు. భూమి కోసం అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత అంతులేని కథ, సిరిసిరి మువ్వ, అడవిరాముడు, యమగోల, ఏజెంట్ గోపీ, శ్రీవారి ముచ్చట్లు, సింహాసనం, సాగర సంగమం, తాండ్ర పాపారాయుడు తదితర సినిమాలలో నటించారు.
1979లో సర్గం అనే మూవీతో హిందీలో అడుగుపెట్టి తన అందం, నటనతో నార్త్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేశారు. హిందీ ఇండస్ట్రీని శ్రీదేవి, హేమామాలిని, రేఖలతో కలిసి ఏలారు జయప్రద. శ్రీదేవితో కొన్నేళ్ల పాటు కోల్డ్ వార్ నడిచిందంటే పరిస్ధితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. సినిమాలో తిరుగులేని నటిగా నిలిచిన జయప్రద.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన జయప్రద టీడీపీ అభ్యర్ధుల కోసం ప్రచారం చేశారు.
అయితే టీడీపీలో సంక్షోభం సమయంలో చంద్రబాబు నాయుడు శిబిరంలో చేరిన జయప్రద ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. అయితే చంద్రబాబుతో విభేదాల కారణంగా ఆమె తెలుగుదేశాన్ని వీడి సమాజ్‌వాది పార్టీలో చేరి 2004లో రాంపూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. తిరిగి 2009లోనూ మరోసారి విజయం సాధించారు. అనంతరం ఆర్ఎల్డీలో చేరి ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో బీజేపీలో చేరారు. సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జయప్రద.. మధ్యలో కొన్ని సినిమాలలో కీలకపాత్రలు పోషించారు. బుల్లితెరపై హోస్ట్‌గానూ అలరించారు.
కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిన జయప్రద వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కెరీర్ పీక్స్‌లో ఉండగా ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే శ్రీకాంత్‌కి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ జయప్రదను ప్రేమించిన శ్రీకాంత్.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నారు. దాంతో శ్రీకాంత్ మొదటి భార్య .. జయప్రదను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. తన భర్త నుంచి విడిపోవాలని వేధింపులకు గురిచేసింది. దాంతో వేధింపులు భరించలేక జయప్రద ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో వైద్య సాయం అందడంతో జయప్రద ప్రాణాలతో బయటపడ్డారు. అయితే పిల్లలు లేకపోవడంతో జయప్రద ఎన్నో అవమానాలు పడ్డారు.. చివరికి తన సోదరి కుమారుడైన సిద్ధార్ధ్‌ను ఆమె దత్తత తీసుకుంది.
తాజాగా ఓ ఛానెల్‌కు జయప్రద ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం పెళ్లి చేసుకోవడమే. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నా.. ఆ సమయంలో నా వయసు 25 ఏళ్లే. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్ని, నా కెరీర్‌ను నాశనం చేసిందని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే నటీనటులకు జయప్రద జీవితం ఒక గుణపాఠం.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/jaya-prada-opens-up-about-her-painful-marriage-decision-that-affected-her-career-168003.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
