
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ప్రియాంక సింగ్. జబర్దస్త్ వంటి కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన ప్రియాంక సింగ్ లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని, తర్వాత పూర్తిగా అమ్మాయిగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు ఎవరికీ తెలియని ఆమె, ఇప్పుడు స్టార్‌గా ఎదిగి ట్రాన్స్జెండర్స్కూ గౌరవం తీసుకురావడంలో కీలకంగా నిలిచింది. బిగ్ బాస్ తెలుగు ద్వారా ప్రియాంక పాపులారిటీ మరింత పెరిగింది. తన జీవితం లో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు, మానసిక ఒత్తిడిని జయించి ధైర్యంగా ముందుకు వచ్చిందని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం టీవీ షోలు, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ, తన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలను ప్రియాంక వెల్లడించింది.
గతంలో ప్రియాంక సింగ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన జీవితంలోని కఠినమైన అనుభవాలను బయటపెట్టింది. చిన్నప్పటి నుంచే తనకు ఆడపిల్లలా తయారవ్వాలని కోరిక ఉండేదని తెలిపింది. అక్క స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆమె బట్టలు వేసుకుని అద్దం ముందు రెడీ అవుతూ తన భావాలను వ్యక్తపరచేదానని చెప్పింది. అయితే కుటుంబ సభ్యులు, సమాజం అర్థం చేసుకోకపోవడంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. పదో తరగతి పూర్తయ్యాక హైదరాబాద్‌కి వచ్చి మేకప్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణం ప్రారంభించిందని ప్రియాంక తెలిపింది. ఆ తర్వాత జబర్దస్త్‌లో అవకాశాలు రావడంతో లేడీ గెటప్స్ వేసి గుర్తింపు పొందింది.
అక్కడి నుంచి వచ్చిన ఆదాయం, కష్టంతో కూడబెట్టిన డబ్బుతో చివరకు జెండర్ సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆ సర్జరీ తర్వాత ఎదురైన శారీరక, మానసిక బాధలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. సర్జరీ అనంతరం తీవ్రమైన నొప్పులతో బాధపడుతూ, ఆసుపత్రిలో సరైన సంరక్షణ లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రక్తం కారుతున్నా కూడా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని చెప్పిన ఆమె, ఆ తర్వాత ఆర్థరైటిస్ రావడంతో బరువు పెరిగి మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ఆ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి తన సంపాదించిన డబ్బంతా ఖర్చు అయ్యి బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా అయినట్లు తెలిపింది.
ఇక తన జీవితంలో మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని ప్రియాంక షాకింగ్ విషయాలు వెల్లడించింది. చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న అవమానాలు తట్టుకోలేక ఒకసారి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నానని, ఆ ఘటనలో తన శరీరం 60 శాతం కాలిపోయిందని తెలిపింది. దాన్ని సరిచేయడానికి చాలా టైమ్ పట్టింది. ఆ తరువాత లవ్ బ్రేకప్ అయ్యినప్పుడు నిద్రమాత్రలు మింగాను. సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆ బాధ భరించలేక మరోసారి నిద్రమాత్రలు మింగానని చెప్పింది. అయినప్పటికీ ప్రతిసారి బతికి బయటపడటం దేవుడి సంకల్పమేనని, తన జీవితానికి ఇంకా ఒక ప్రత్యేక అర్థం ఉందని నమ్ముతున్నానని భావోద్వేగంగా వెల్లడించింది.
ఒకప్పుడు మద్యం, సిగరెట్ అలవాట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా మానేశానని, ప్రస్తుతం కుటుంబం తనకు అండగా నిలుస్తోందని తెలిపింది. కెరీర్ పరంగా కూడా ప్రియాంక మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ప్రియాంక సింగ్ కథ కేవలం ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు.. తన వ్యక్తిత్వం కోసం పోరాడిన ఒక మహిళ యొక్క ప్రేరణాత్మక ప్రయాణం. ఎన్నో అవమానాలు, కష్టాలను జయించి ఈ స్థాయికి చేరుకున్న ఆమె, నేటి యువతకు ధైర్యం, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/television/throwback-interview-priyanka-singh-struggles-surgery-survival-inspiring-journey-169193.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
