
నటీనటులు: ఐశ్వర్య అర్జున్, నిరంజన్, సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, డబ్బింగ్ జానకి, కోవై సరళ, బిత్తిరి సత్తి, సిరి హన్మంతు, నర్రా శ్రీను, రాజ్ కుమార్, అర్జున్ సర్జా, ధ్రువ్ సర్జా (స్పెషల్ అప్పీయరెన్స్) తదితరులు
నిర్మాత, దర్శకత్వం: అర్జున్ సర్జా
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫి: జీ బాలమురగన్
ఎడిటింగ్: అయూబ్ ఖాన్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: అర్జున్ సర్జా
బ్యానర్: శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
రిలీజ్ డేట్: 2026-02-14
చిన్నతనంలోనే తల్లి మరణించడంతో తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్యరాజ్) సంరక్షణలో సీత ( ఐశ్వర్య అర్జున్) పెరుగుతుంది. తండ్రి, కూతుళ్లు ఒకరంటే మరొకరు ప్రాణంగా జీవిస్తుంటారు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మ్యారేజ్ చేసుకోవడానికి నిరాకరిస్తుంది. వైజాగ్‌లో నివసించే సీత.. ఓ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వెళ్తుండగా అభి (నిరంజన్) పరిచయం అవుతాడు. కాన్ఫరెన్స్‌లో జరిగిన ఓ యాక్సిడెంట్ ఆమె ఆలోచనా విధానాన్ని మార్చి వేస్తుంది.
అభి, అతడి కుటుంబం పరిచయంతో సీత లైఫ్‌లో ఎలాంటి ప్రభావం పడింది? ఆమె జీవిత ప్రయాణం ఎలా మలుపు తిరిగింది? సీత ప్రయాణంలో గిరి (అర్జున్ సర్జా), బసవన్న (ధృవ్ సర్జా) పాత్రలు ఎలా తోడ్పాటును అందించాయి? అభి, సీత పరిచయం పెళ్లి వరకు వెళ్లిందా? అనే ప్రశ్నలకు సమాధానమే సీత పయనం సినిమా కథ.
దర్శకుడిగా అర్జున్ సర్జా తన కూతురు ఐశ్వర్య అర్జున్ను దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ వాల్యూస్, సనాతన ధర్మం, గోరక్ష లాంటి అంశాలను బేస్‌గా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. దర్శకుడిగా ఈ కథలో చాలా విషయాలను చెప్పాలనే ప్రయత్నమే మెయిన్ కథను సైడ్ ట్రాక్ పట్టించేలా చేసింది. కాకపోతే శ్రీ రామచంద్రుడు, హిందీ ధర్మం, భారతీయ కుటుంబ విలువలు అంశాలను చక్కగా రాసుకొని ఫీల్‌గుడ్ సన్నివేశాలుగా మార్చారు. కాకపోతే డైలాగ్స్ కొంత మేరకు ఫర్వాలేదనిపిస్తాయి. కానీ ప్రతీ ఎపిసోడ్లో సంభాషణలు బోధనలుగా మారడం కొంత ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో సీత రోడ్ జర్నీలో పండ్లు అమ్మే చిన్నారి ఎపిసోడ్, అర్జున్ సర్జా ఎంట్రీ హైలెట్ అనిపిస్తాయి.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ధ్రువ్ సర్జా గోరక్ష ఎపిసోడ్ మరో హైలెట్ అనిపిస్తుంది. ధ్రువ్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయి. కుటుంబ విలువల గురించి ప్రకాశ్ రాజ్ చెప్పిన విషయాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉంటాయి. ఇక అప్పటి వరకు ఒక జోన్లో వెళ్లిన కథను సీత లైఫ్‌కు సంబంధించిన ఓ ఎమోషనల్ పాయింట్‌తో మరో జోన్లోకి తీసుకెళ్లారు. సీత పెళ్లి ఎందుకు చేసుకోకూడదనే విషయం గురించి చెప్పిన కథ పూర్తిగా సినిమాను భావోద్వేగంగా మార్చింది. అయితే ఒక్కోసారి ఈ సినిమా అతిగా ఫ్యామిలీ వాల్యూస్ గురించి డిస్కస్ చేయడం వల్ల టెలివిజన్ సీరియల్ మాదిరిగా సాగుతుందా? అనే ఫీలింగ్‌ను అక్కడక్కడ కలుగజేస్తుంది. ఏది ఏమైనా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో వచ్చిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చెప్పుకోవచ్చు. ఎలాంటి అశ్లీలత, అసభ్యకరమైన డైలాగ్స్ లేకుండా చేసిన కుటుంబ విలువలు ఉన్న సినిమా అని చెప్పుకోవచ్చు.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఐశ్వర్య అర్జున్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. సీత క్యారెక్టర్లో హావభావాలు, ఎమోషన్స్‌ను చక్కగా పలికించారు. డైలాగ్ డెలివరీలోను, అలాగే డ్యాన్సులు, భావోద్వేగా సన్నివేశాల్లో టాప్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొన్నది. ఇక నిరంజన్ కూడా ఐశ్వర్యతో పోటాపోటిగా నటించారు. కొత్తవాడైనా ఏ మాత్రం తొణుకు, బెణుకు లేకుండా నటించాడు. సత్యరాజ్ తండ్రి పాత్రలో ఎమోషన్స్‌ను భారీగా పంచాడు. అంతపురం గెటప్‌లో ప్రకాశ్ రాజ్ తాత క్యారెక్టర్లో సినిమాకు బలంగా మారారు. అర్జున్, ధ్రువ సర్జా అతిథి పాత్రలు మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ లేని కొరతను పూడ్చాయి. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.
సీతా పయనం సినిమాకు అత్యంత బలం అనూప్ రూబెన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాలో పలు సన్నివేశాలను ఆయన తన రీ రికార్డింగ్‌తో బాగా ఎలివేట్ చేశారు. బాల మురగన్ సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. రోడ్ జర్నీని బాగా షూట్ చేశారు. అయూబ్ ఖాన్ ఎడిటింగ్ పరంగా నిరాశపరిచాడు. కనీసం 10 నుంచి 15 నిమిషాల రన్ టైమ్‌ను తగ్గించాల్సి ఉండేదనిపిస్తుంది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ బాగున్నాయి. అర్జున్ సర్జా కంపోజ్ చేసిన ఫైట్స్ కొత్తగా ఉన్నాయి. శ్రీ రామ్ ఇంటర్నేషనల్ బ్యానర్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయి ఉండేది.
ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. రొటీన్, రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాగానే కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో గోరక్షణ, హిందూ విలువలు, బాలికల అక్రమ రవాణా, మరుగున పడిపోతున్న ఫ్యామిలీ వాల్యూస్ అంశాలు ఈ సినిమాను వైవిధ్యంగా మార్చాయి. ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమాను చూడాలంటే ఈ వారం ఈ మూవీని ఎందుకోవచ్చు. కొంత ఓపికతోపాటు అంచనాలు లేకుండా వెళితే ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. థియేట్రికల్ వాల్యూ ఉన్న సినిమా.. బిగ్ స్క్రీన్లోనే చూడండి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/seetha-payanam-movie-review-and-rating-in-telugu-arjun-sarja-movie-preaches-family-values-166897.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
