
తెలుగు చిత్ర పరిశ్రమలో తల్లి, వదిన, అక్క, అత్త పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హేమ, సురేఖ వాణి. ఒకానొక దశలో వీరిద్దరూ లేకుండా ఏ సినిమా వచ్చేది కాదంటే అతిశయోక్తి కాదు. త్రివిక్రమ్, శ్రీనువైట్ల, కృష్ణవంశీ తదితర దర్శకుల సినిమాలలో అయితే వీరు ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా వీరిద్దరూ తక్కువ సమయంలోనే కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ప్రస్తుతం హేమ – సురేఖ వాణి హవా పూర్తిగా తగ్గింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఒకప్పటి టాప్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తుండటంతో హేమ, సురేఖ వాణి, సుధ వంటి వారికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
సురేఖవాణి కంటే ఇండస్ట్రీలో హేమ సీనియర్. చిన్న వయసులోనే తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆమె… 90వ దశకంలోనే పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత పెళ్లి, పిల్లల కారణంగా కొంత గ్యాప్ ఇచ్చారు. తిరిగి పరిస్థితులు చక్కబడిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు హేమ. గోదావరి యాసలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆమె కడుపుబ్బా నవ్వించారు. మనసులో ఏమున్నా సరే కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం హేమ స్టైల్.
తన దూకుడుతో పలుమార్లు వివాదాల్లోనూ చిక్కుకున్నారు హేమ. ముఖ్యంగా మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఆమె వరుస ప్రెస్‌మీట్లు, లైవ్ డిబేట్‌లలో పాల్గొని వాడి వేడి విమర్శలు చేసి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. సినిమాలతో పాటు బిగ్‌బాస్‌లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటారు హేమ. ఇక గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పేరు తెరపైకి రావడం తెలుగు చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఈ డ్రగ్స్ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హేమకు కోర్ట్ క్లీన్ చీట్ లభించింది. సినిమాలలో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో హేమ గతంలో మాదిరిగా కనిపించడం లేదు.
ఇక సురేఖ వాణి విషయానికి వస్తే… విజయవాడకు చెందిన ఈమెకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. భర్త బుల్లితెర ఇండస్ట్రీలో ఉండటంతో యాంకర్‌గా అడుగుపెట్టారు. ఈ దశలో మొగుడ్స్ పెళ్లామ్స్ కార్యక్రమం సురేఖకు మంచి పేరు తీసుకురావడంతో సినిమాల్లోనూ ఆఫర్లు క్యూకట్టాయి. దాంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవకాశం లేకుండా పోయింది. కొన్నేళ్ల పాటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలుగొందారు సురేఖ. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో ఆమె భర్త హఠాన్మరణంతో సురేఖ వాణి కుంగిపోయారు. అప్పటి నుంచి సినిమాలు తగ్గించి.. తన కుమార్తె సుప్రీతను పెంచి పెద్దచేశారు. ప్రస్తుతం కూతురి కెరీర్‌ను నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు సురేఖ.
తొలి నుంచి సురేఖ వాణి- హేమలు మంచి స్నేహితులు. ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. నాటి నుంచి ఈ బంధం కొనసాగుతూనే ఉంది. వీలున్నప్పుడల్లా ఇద్దరూ కష్టసుఖాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఫాంహౌస్‌లో సురేఖ వాణి – హేమలు కలుసుకున్నారు. అంతేకాదు… తోటలోని ఈత చెట్టు దగ్గరికి వెళ్లి స్వయంగా కల్లు కుండను దింపుకుని దానిని వడపోసి తాగుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వారిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది. సురేఖ, హేమతో పాటు ఆ ఫాంహౌస్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బిజీ లైఫ్‌కు దూరంగా స్నేహితులతో వీరిద్దరూ ఎంజాయ్ చేసి సేదతీరారు.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/whats-new/hema-and-surekha-vani-s-chill-at-farmhouse-moments-go-viral-168197.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
