
నటీనటులు: శివ కార్తీకేయన్, రవి మోహన్, శ్రీలీల, అథర్వ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ బేలవాడీ, కాళీ వెంకట్ తదితరులు
మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధా కొంగర
కథ: మథిమారన్ పుగజేంది
నిర్మాత: ఆకాశ్ భాస్కరన్
సినిమాటోగ్రఫి: రవి కే చంద్రన్
ఎడిటింగ్: సతీష్ సూర్య
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
బ్యానర్: డాన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2026-01-10
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-02-07
బ్రిటీష్ పరిపాలన కాలంలో ప్రవేశపెట్టిన ఆంగ్ల భాషను కొనసాగించకుండా దేశవ్యాప్తంగా హిందీని అధికారిక భాషను అమలు చేయాలని కేంద్ర నిర్ణయిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం, ఇతర విషయాలను హిందీలో ప్రచురించడం వల్ల దక్షిణాదిలో నిరుద్యోగులు తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందుతారు. రైల్వే ఉద్యోగం కోసం హిందీ నేర్చుకొన్న ఛెజియన్ (శివ కార్తీకేయన్)ను భాష సరిగా మాట్లాడటం లేదనే కారణంతో జాబ్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అలా తమకు అన్యాయం జరుగుతుందని భావించిన తమిళులందరూ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఛేజియన్ ప్రేయసి రత్నమాల (శ్రీలీలల) రేడియో జాకీగా, సోదరుడు చిన్నాదురై (అథర్వ) సపోర్ట్ చేస్తారు. ఆ ఉద్యమాన్ని అణిచి వేయడానికి తమిళ మూలాలు ఉన్న ఉత్తరాది పోలీస్ ఆఫీసర్ తిరు (రవి మోహన్)ను నియమిస్తుంది.
ఛేజియన్కు, తమిళులు, దక్షిణాదివాసులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం ఏమిటి? బలవంతంగా హిందీ భాషను రుద్దడం వల్ల దక్షిణాది నిరుద్యోగులు ఎలా అవకాశాలు కోల్పోయారు? హిందీ భాష హాటావో అనే తిరుగుబాటు తమిళంలో ఎలా పుట్టింది? ఛేజియన్ నాయకత్వంలో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎలా సాగింది? కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఎలా అణిచివేసేందుకు ప్రయత్నం జరిగింది? ఉద్యమకారులపై ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తిరు పైశాచికత్వాన్ని ఎలా ప్రదర్శించారు. రత్నమాల ఉద్యమంలో ఎలాంటి సహకారం అందించింది? ఈ ఉద్యమంపై అప్పటి ప్రధాని స్పందన ఏమిటి? హిందీ వ్యతిరేక ఉద్యమం ఎలాంటి విజయం సాధించింది? అనే ప్రశ్నలకు సమాధానమే పరాశక్తి సినిమా కథ.
1960 నాటి కాలంలో తమిళనాడులో ఉవ్వెత్తున్న సాగిన హిందీ భాష వ్యతిరేక ఉద్యమం నేపథ్యంగా దర్శకురాలు సుధా కొంగర ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఉద్యేగభరితమైన అంశాలను సినీ తెరపైన కథ, సన్నివేశాలుగా ఆవిష్కరించిన తీరు కూడా మెప్పించేలా ఉంది. మరుగున పడిన అంశాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా అభినందించాలి. అయితే ఉద్యమ తీరును బాగా చిత్రీకరించినప్పటికీ.. కథలో గుండెను మెలిపెట్టే ఎమోషన్స్ కరువవయ్యాయి అనిపిస్తుంది. భావోద్వేగాలతో సాగే కథలో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు ఆ సీరియస్‌నెస్‌ను దెబ్బ తీసిందా? అనే అనుమానం కలుగుతుంది.
శివ కార్తీకేయన్, రవి మోహన్ క్యారెక్టర్లను బాగా డిజైన్ చేసింది. శ్రీలీల ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేయాల్సిందినిప్తుంది. రానా దగ్గబాటి, అథర్వ పాత్రలను గాలికి వదిలేశారు. ఇందిరాగాంధీని పోలిన పాత్రను చాలా నాసిరకంగా చూపించడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. ఇక తెలుగు డబ్బింగ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. దాంతో సినిమాకు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే విషయంలో కొంత గందరగోళం కనిపిస్తుంది. ఈ కథలో లోపాలను పక్కన పడితే.. ఈ జనరేషన్ వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దక్షిణాది వారు ఎలాంటి మోసాలకు గురి అవుతున్నారో అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయడం ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే అనే ఫీలింగ్ కలిగిస్తుంది.
హిందీ వ్యతిరేక ఉద్యమ నాయకుడిగా శివకార్తీకేయన్ తన పాత్రలో పూర్తిగా లీనమై నటించారు. కీలక సన్నివేశాల్లో ఆయన హావభావాలు, పాత్రపరంగా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి. ఆయన కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇక అణిచివేత ఆఫీసర్ తిరుగా రవి మోహన్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌కు పూర్తిగా న్యాయం చేశారు. శ్రీలీల పాత్రకు కొంత మేరకు ప్రధాన్యం ఉన్నట్టు కనిపించినా.. పూర్తిస్థాయిలో లేకపోవడం కొంత నిరాశగా అనిపిస్తుంది. చీరకట్టులో ఫుల్ గ్లామర్‌తో కనిపించింది. అథ్వర్వ ఫర్వాలేదనిపించాడు. రానా దగ్గుబాటి అతిథి పాత్రను ఎందుకు చేశాడా? అనే అనుమానం కనిపిస్తుంది. తీక్షణంగా గమనిస్తే తప్పా.. ఇతను రానా అని రిజిస్టర్ అవ్వడం. అలాంటి పాత్ర చేయడం ద్వారా చాలా డిజాపాయింట్ చేశాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఒకే అనిపించారు.
టెక్నికల్‌గా పరాశక్తి బ్రిల్లియెంట్‌గా కనిపిస్తుంది. ఆనాటి పరిస్థితులు, వాతావరణాన్ని బాగా తెర మీదకు తీసుకొచ్చారు. ఆర్ట్ విభాగం పనితీరు, రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సతీష్ సూర్య ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కాలేని ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. తీరిక సమయాన్ని చూసుకొని ఒకే స్ట్రెచ్‌లో మూవీని చూసేయండి.. మంచి అనుభూతిని పంచుతుంది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/parasakthi-movie-review-and-rating-in-telugu-sivakarthikeyan-knocks-out-in-periodic-drama-167005.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
