
Singer Mangli: జానపద గేయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, తర్వాత ప్లేబ్యాక్ సింగర్‌గా దూసుకెళ్లిన సింగర్ మంగ్లీ (Mangli). తెలుగులో ఎన్నో పాటలు పాడిన మంగ్లీ.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఇతర భాషలలో కూడా పాటలు పాడుతూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ఈ సింగర్ ఓ బాలీవుడ్ సినిమాలో పాట పాడటం వివాదాస్పదంగా మారింది. అందులోని లిరిక్స్ అసభ్యకరంగా ఉండటంతో వివాదంలో చిక్కుకుంది. దీంతో ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ పాట ఏంటీ? ఆ వివాదంపై మంగ్లీ ఎలా స్పందించింది. అనే వివరాల్లోకెళ్తే..
తాజాగా సింగర్ మంగ్లీ పాన్-ఇండియా చిత్రం KD: ది డెవిల్ (KD: The Devil)సినిమా కోసం ఒక పాట పాడింది. ఈ చిత్రంలో ధృవ సర్జా హీరోగా నటిస్తుండగా, దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఈ స్పెషల్ సాంగ్… ఇప్పుడు అనుకోకుండా వివాదానికి కేంద్రబిందువైంది. అయితే.. ‘సర్కే చునర్ తేరి సర్కే’ అనే పాట లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అంశం ఈ వివాదాస్పదంగా మారింది.
లిరిక్స్‌పై వివాదం ఎలా మొదలైంది?
‘సర్కే చునర్ తేరి సర్కే’ పాటలో డబుల్ మీనింగ్ లిరిక్స్ ఉన్నాయనే ఆరోపణలతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఉన్న పదాలు అశ్లీలతను ప్రోత్సహిస్తున్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమర్షియల్ పాటల పేరుతో సాహిత్యం దిగజారిపోయిందంటూ సినీ అభిమానులు, సామాజిక వర్గాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డ్‌కు ఫిర్యాదు చేయడం, అలాగే బాలీవుడ్ నటి కంగన రనౌత్ కూడా ఈ అంశంపై మండిపడటంతో ఈ వివాదం మరింత పెరిగింది. దీంతో ఈ పాటను నిషేధించాలని డిమాండ్లు పెరిగాయి.
పాట తొలగింపు.. మంగ్లీ స్పందన
వివాదం తీవ్రరూపం దాల్చడంతో, ఆ పాటను అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో మంగ్లీ సోషల్ మీడియాలో స్పందిస్తూ… ‘ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ పాటను తొలగించాం. అనుకోకుండా జరిగిన పొరపాటుకు హృదయపూర్వక క్షమాపణలు’ అని తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ఈ పాట ద్వారా ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తమకు లేదని, కానీ జరిగిన తప్పిదంపై చింతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే లిరిక్స్‌లో మార్పులు చేసినట్లు, సవరించిన వెర్షన్‌ను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ వివాదంపై మంగ్లీ స్పందిస్తూ.. ‘ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా జాగ్రత్త పడతాం’ అని హామీ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చినందుకు సంగీత దర్శకుడు అర్జున్ జన్యకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటనతో కమర్షియల్ పాటలలో వస్తున్న డబుల్ మీనింగ్ లిరిక్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు వినోదం పేరుతో ఇలాంటి పాటలు వస్తున్నాయని విమర్శలు వస్తుండగా, మరోవైపు క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో వాటిని సమర్థించే వర్గాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ పాటతో ప్రారంభమైన ఈ వివాదం.. సాహిత్యం, సంస్కృతి, ప్రేక్షకుల భావోద్వేగాలను మరోసారి గుర్తు చేసింది. ఈ క్రమంలో మంగ్లీ క్షమాపణలు, సాంగ్ తొలగింపు, రివైజ్డ్ వెర్షన్ ప్రకటనతో ఈ వివాదానికి తాత్కాలికంగా పుల్‌స్టాప్ పడినట్టు అయ్యింది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/whats-new/singer-mangli-apologises-over-kd-the-devil-song-controversy-lyrics-updated-168233.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
