
నటీనటులు: అనిల్ కపూర్, రాధిక మదన్, కుష్బూ సుందర్, సౌరభ్ శుక్లా, ఆదిత్య రావల్, మోనా సింగ్, ఫైజల్ మాలిక్, నానా పాటేకర్, మోహిత్ తివారీ తదితరులు
రచన, దర్శకత్వం: సురేష్ త్రివేణి
నిర్మాతలు: అనిల్ కపూర్, విక్రమ్ మల్హోత్రా, సురేష్ త్రివేణి
సినిమాటోగ్రఫి: ఆయన్ సక్సేనా
ఎడిటింగ్: శివకుమార్ వీ పనికర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రోహన్ వినాయక్ మ్యూజిక్
బ్యానర్స్: అనిల్ కపూర్ ఫిల్మ్, కమ్యూనికేషన్ నెట్ వర్క్
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-03-05
అర్జున్ మౌర్య (అనిల్ కపూర్) భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేసి రిటైర్డ్ అవుతాడు. తన రిటైర్డ్ లైఫ్‌ను మధ్య ప్రదేశ్‌లోని తన సొంత గ్రామంలో గడిపేందుకు సిద్దమవుతాడు. కానీ తన ప్రాంతంలో బాబ్లీ దీదీ (మోనా సింగ్), తన కుమారుడు ప్రిన్స్ (ఆదిత్య రావల్) ఫ్యాక్షన్ అరాచకాలు, ఇసుక మాఫియా వల్ల సాధారణ ప్రజలు బలి అవుతుంటారు. ఓ తల్లి ముందే ఓ బాలుడిని దారుణంగా ప్రిన్స్ కాల్చి చంపుతాడు. అయితే ప్రిన్స్ ఆగడాలను సైనికుడిగా అర్జున్ మౌర్య జీర్ణించుకోలేకపోతాడు. అర్జున్ కూతురు షామా మౌర్య తోటి స్టూడెంట్స్ చేసే ఆగడాలపై పోరాటం చేస్తుంటుంది. అర్జున్ మౌర్య, షామాపై ప్రిన్స్ మాఫియా వర్గం దారుణంగా దాడులకు పాల్పడుతుంటారు.
ప్రిన్స్ నుంచి సుబేదార్ అర్జున్‌కు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? తన సొంత గ్రామంలో అర్జున్‌కు ఆవేదన కలిగించిన విషయాలు ఏమిటి? ప్రిన్స్‌కు బాడీగార్డ్‌గా చేరిన అర్జున్.. ఆ డ్యూటీ నుంచి ఎందుకు తప్పుకొన్నాడు? ప్రిన్స్ తల్లి దీది ఎందుకు జైలులో శిక్ష అనుభవిస్తున్నది? ప్రిన్స్, అర్జున్ మౌర్యకు మధ్య జరిగిన గొడవలు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి? కాలేజీలో షామా మౌర్యకు తోటి స్టూడెంట్స్‌తో జరిగిన అవమానం ఏమిటి? తండ్రిని షామా ఎందుకు కోపం పెంచుకొన్నది? భార్య (కుష్బూ) మరణంతో సుబేదార్ ఎలా కుంగిపోయాడు? చివరకు ప్రిన్స్ ఫ్యాక్షన్ దందాకు అర్జున్ ఎలా ముగింపు పలికాడు? అర్జున్‌కు తోటి సిపాయి (నానా పాటేకర్) ఎలా సహకారం అందించాడు అనేది ఈ సినిమా కథ.
సరిహద్దులో శత్రువులతో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన జవాన్.. తన సొంత గడ్డపై ఆటవిక రాజ్యాన్ని ఎదుర్కోవడం అత్యంత కష్టంగా మారిన అంశమే ఈ సినిమా కథ. ఈ కథను సన్నివేశాలుగా మలిచిన విధానం, ఆ సీన్లలో ఎమోషన్స్ దట్టించిన తీరుతోనే సినిమా చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. మూవీ ఆరంభంలోనే ఎలాంటి జాప్యం లేకుండా సురేష్ త్రివేణి కథలోకి తీసుకెళ్లిన విధానం.. సుబేదార్‌గా అనిల్ కపూర్ పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. అండర్ డాగ్‌గా సుబేదార్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసి.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆ పాత్ర ఆర్క్‌ను పెంచిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ఇక రా, రస్టిక్ తరహాలో బ్యాక్ డ్రాప్ వాతావరణం సృష్టించిన తీరు, పాత్రలను అందుకు అనుగుణంగా మలిచిన విధానంతోనే సినిమా అనుక్షణం ఆకట్టుకొనేలా చేస్తుంది. తెలుగులో ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులి సినిమా తరహాలోనే ఈ సినిమా కథ సాగుతుందనే ఫీలింగ్ కలిగించారు.
అనిల్ కపూర్ తన వయసుకు తగిన పాత్రలో జీవించేశాడు. ఏ కోణంలో కూడా ఓ స్టార్‌గా తెరపైన కనిపించకుండా తన పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. అనిల్ కపూర్ కూతురు షామాగా రాధిక మదన్ కూడా పవర్‌పుల్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. అనిల్‌తో పోటీ పడుతూ నటించింది. ఈ సినిమాలో మరో రెండు ముఖ్యమైన పాత్రలు ప్రిన్స్, దీది పాత్రల్లో ఆదిత్య రావల్, మోనాసింగ్ బ్రిల్లియెంట్ ఫెర్ఫార్మ్ చేశాడు. ఆదిత్య చిన్నవాడైనా అనుభవం ఉన్న పెద్ద నటుడిలా తన క్యారెక్టర్‌ను పోషించాడు. సౌరభ్ శుక్లా గుర్తుండిపోయే పాత్రలో కనిపించాడు. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నానా పాటేకర్ అతిథి పాత్రలో మెరిసాడు. చిత్రంలో నటించిన వారంతా తమ పాత్రల ప్రభావాన్ని తెరపైన కనిపించేలా చూపించారు.
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి విభాగం పూర్తిగా డామినేట్ చేసింది. గ్రామీణ ప్రాంత వాతావరణం, ఆర్టిస్టుల మేకప్, కథకు అవసరమైన కలర్ ప్యాటర్న్, ప్రొడక్షన్ డిజైన్ అంశాలను టీమ్ వర్క్‌గా తెర మీదకు తీసుకు రావడంలో ఆయన్ సక్సేనా నూటికి నూరు మార్కులు సొంతం చేసుకొన్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్స్ బ్రిల్లియంట్ వర్క్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌లో ఉన్నాయి.
యాక్టర్ల టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ బ్రిల్లియన్స్‌తో రా, రస్టిక్ రూరల్ ఫ్యాక్షన్ డ్రామాగా సుబేదార్ రూపొందింది. సినిమాటిక్ లిబర్డీ చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. లాజిక్స్ కొన్ని చోట్ల మినింగ్ ఫుల్‌గా అనిపించవు. కానీ చాలా నిజాయితీతో కూడిన హానెస్ట్ అటెంప్ట్. ఈ సినిమా నేరుగా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. తెలుగు, హిందీ, ఇతర భాషల్లో అందుబాటులో ఉంది. ఒకేసారి చూసే విధంగా తగినంత సమయాన్ని కేటాయించి వీక్షిస్తే మంచి థ్రిల్లింగ్, ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతుంది. అనిల్ కపూర్, రాధిక మదన్, మోనా సింగ్, ఆదిత్య పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. మీకు కూడా అంతే రేంజ్‌లో నచ్చుతుందని భావిస్తున్నా. ఇటీవల కాలంలో వచ్చిన ఎమోషనల్ కంటెంట్ సినిమాల్లో ఒకటి. మంచి అనుభూతిని పంచుతుంది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/subedaar-hindi-movie-review-and-rating-in-telugu-anil-kapoor-steal-the-show-with-high-octane-action-167787.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
