
This Week OTT Releases: కొత్త ఏడాదికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ… థియేటర్లు, ఓటీటీలు రెండూ హౌస్‌ఫుల్ మూడ్‌లో ఉన్నాయి. మరో ఐదు రోజుల్లో 2026కి స్వాగతం పలకనున్న నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ కలకలలాడుతోంది. ఛాంపియన్, దండోరా, ఈషా, శంబాల వంటి నాలుగు చిన్న సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సందడి చేస్తుంటే.. మరోవైపు ఓటీటీ వేదికలపై కూడా క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కి వచ్చాయి. థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకుల కోసం ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అయిన కంటెంట్ నిజంగానే బాగానే ఉంది. డిఫరెంట్ జానర్లలో, డిఫరెంట్ భాషల్లో వీకెండ్ మొత్తం ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్న సినిమాలు, సిరీస్‌లపై ఒక సమగ్ర విశ్లేషణ ఇది.
రివాల్వర్ రీటా
ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ‘రివాల్వర్ రీటా’గురించి మాట్లాడుకుంటే… గత నెల చివర్లో థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. కీర్తి సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీ మూవీకి చంద్రు దర్శకత్వం వహించారు. రాధిక శరత్‌కుమార్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లే, జాన్ విజయ్ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 28న థియేటర్లలో విడుదలైనప్పటికీ సరైన ప్రమోషన్ లేకపోవడం, రిలీజ్ ఆలస్యం కారణంగా సినిమా ప్రేక్షకుల దృష్టికి అంతగా చేరలేదు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమాగా ఇది నిలుస్తోంది.
ఆంధ్ర కింగ్ తాలూకా
తదుపరి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి మహేశ్‌బాబు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదలై కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో మిస్ అయినవారు, ముఖ్యంగా రామ్ అభిమానులు ఓసారి చూడవచ్చు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఒక ముద్దు సన్నివేశం తప్పితే మిగతా భాగం కుటుంబంతో కలిసి చూసేయొచ్చు.
బాహుబలి: ది ఎపిక్
ఇక టాలీవుడ్ చరిత్రనే మార్చేసిన మెగా బ్లాక్‌బస్టర్ ‘బాహుబలి: ది ఎపిక్’కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు. కట్టప్పగా సత్యరాజ్, నాజర్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రూపొందించిన ఈ వెర్షన్‌ను ఇటీవల థియేటర్లలో విడుదల చేసిన చిత్రయూనిట్, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5
వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ ప్రస్తుతం హాట్ టాపిక్. నెట్‌ఫ్లిక్స్ ఈ సీజన్‌ను వాల్యూమ్స్‌గా విడుదల చేస్తోంది. ఇప్పటికే వాల్యూమ్ 1గా నాలుగు ఎపిసోడ్స్ విడుదల చేయగా, తాజాగా వాల్యూమ్ 2లో 5, 6, 7 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్కు వచ్చాయి. చివరి ఎనిమిదో ఎపిసోడ్ జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో కూడా దీనిని ప్రదర్శించనున్నట్లు సమాచారం. భారతదేశంలో ఈ సిరీస్ డిసెంబర్ 26 ఉదయం 6:30 నుంచి రీజనల్ భాషల్లో అందుబాటులో ఉంది.
ఎకో
మలయాళ థ్రిల్లర్ సినిమాలపై తెలుగు ప్రేక్షకులకు ఉన్న క్రేజ్‌ను మరోసారి గుర్తు చేస్తోంది ‘ఎకో’. ‘కిష్కింధ కాండం’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు దిన్జిత్ అయ్యతన్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నటించగా, వినీత్, నరైన్ కీలక పాత్రల్లో మెరిశారు. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లోని అడవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ డిసెంబర్ 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. న్యూ ఇయర్ కానుకగా ఓటీటీకి వస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్‌కు మంచి ట్రీట్‌గా నిలవనుంది.
మిడిల్ క్లాస్
ఇక తమిళ హిట్ మూవీ ‘మిడిల్ క్లాస్’ కూడా ఓటీటీలోకి ఎంటర్ అవుతోంది. మునిష్ కాంత్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా గత నెల 21న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఈఎంఐలు, బడ్జెట్ లెక్కలు వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. డిసెంబర్ 24 నుంచి జీ5లో తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా వచ్చే అవకాశముందని సమాచారం.
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫాంలలోకి వచ్చిన ఇతర కంటెంట్‌ను చూసుకుంటే… నెట్‌ఫ్లిక్స్‌లో ‘గుడ్ బై జూన్’ (తెలుగు) డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హాట్‌స్టార్‌లో ‘నోబడీ 2’, ‘ఒసిరిస్’, ‘అమడస్’, ‘ది బ్యాడ్ బాయ్ అండ్ మీ’ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. జీ5లో ‘మిడిల్ క్లాస్’, ‘రోంకిని భవన్’, అమెజాన్ ప్రైమ్‌లో ‘టుగెదర్’, ‘సూపర్ నేచురల్’ వంటి కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తంగా చూస్తే… థియేటర్లు, ఓటీటీలు రెండింట్లోనూ ఈ వారం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ దొరకబోతోంది. మీరు థియేటర్‌కైనా, ఓటీటీకైనా ప్లాన్ చేస్తున్నారా అంటే… ఈ వీకెండ్ బోర్ కొట్టే ఛాన్స్ మాత్రం లేదు.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/ott/this-week-ott-releases-new-movies-and-web-series-streaming-ahead-of-new-year-2026-164882.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
